- నేడు ప్రపంచ ధరిత్రి (భూమి) దినోత్సవం
- పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం
- పెరుగుతున్న కాలుష్యం
- పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న వైనం
- భూమిని కాపాడడం మన బాధ్యత
అనన్య న్యూస్: మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఆధారం భూమి మాత్రమే. గాలి, నీరు, అగ్ని, నేల, ఆకాశం అనే పంచభూతాల వల్లే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం స్తంభించక తప్పదు. భూమి సారవంతంగా, సస్యశ్యామలంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అగ్రరాజ్యాల అంతులేని ఆధిపత్య దాహమే భూమండలం కాలుష్యానికి చిరునామాగా మారింది. భూమి ఉపరితలంపై ఉన్న వనరులనే కాదు, అట్టడుగున దాగి ఉన్న భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడేసుకుంటున్నాయి. ఈ వాడుక వల్ల భూతాపం పెరగడమే కాకుండా, రాబోయే వందేళ్ళలో ముడిచమురు నిల్వలు అంతరించిపోతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజు రోజుకూ పచ్చని చెట్లు తగ్గిపోవడం, కొన్ని జీవరాశులు నశించిపోవడం కారణంగా భూతాపం పెరుగుతూ వస్తుంది. నానాటికీ పెరుగుతున్న భూతాపంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని జీవరాశి మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. పరిశ్రమలు, వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు వెలువరిస్తున్న ఫ్లోరోఫోర్ కార్బన్‌లు భూగ్రహాన్ని వేడెక్కిస్తున్నాయి. పలురకాల కాలుష్యాలు భూతాపాన్ని పెంచుతున్నాయి. భూతాపం పెరగడంవల్ల పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవడం ద్వారా జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పులు ఏర్పడి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువు, కాటకాలు ఏర్పడుతున్నాయి. వర్షాలు లేని కారణంగా జల వనరులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్ వార్మింగ్‌తో ఓజోన్ పొర దెబ్బతింటోంది. పెరిగిపోతున్న భూతాపం, వాతావరణ కాలుష్యంతో అల్లాడుతున్న భూమాతను కాపాడుకునేందుకు పర్యావరణ పరిరక్షణ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ధరిత్రి దినోత్సవ ప్రత్యేక కథనం..
దరిత్రి దినోత్సవ ముఖ్య ఉద్దేశం:
భూమి, పర్యావరణ పరిరక్షణ, అంతరించి పోతున్న సహజ వనరులు, జీవవైవిధ్యం కోల్పోవడం, కాలుష్యం పెరగడం వంటి పర్యావరణ సమస్యలను ఎత్తిచూపడానికి ప్రతి ఏటా 1970, ఏప్రిల్ 22 నుంచి ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భూమి మనుగడ కోల్పోకుండా ఉండేందుకు నేటి, భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. 1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్రతీరం చమురు తెట్టులతో నిండింది, సమద్రతీరమే ఆలంబనగా ఉన్న వందలాది జీవ జాతులు మృత్యువాతపడ్డాయి. సుమారు నాలుగువేల పక్షుల రెక్కలు ఆ చమురు తెట్టులో చిక్కుకొని ఎగిరే దారిలేక అవి ప్రాణాలొదిలాయి. ఇలా జీవ వైవిధ్యం కొడిగట్టింది. ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి ఆనాటి సంఘటన పునాదిగా మారింది. అమెరికన్ సెనేటర్ గెలార్డ్ నెల్సన్ పర్యావరణ పరిరక్షణకు అప్పుడు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకుని అమెరికాలో 20 లక్షల మంది ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవంలో పాల్గొన్నారు. పారిశ్రామికీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణం గురించి అజాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని ఆనాటి అమెరికన్ సెనేటర్ గెలార్డ్ నెల్సన్ ఎర్త్ డే (ధరిత్రి దినోత్సవం)కు రూపకల్పన చేశాడు. మొదట అమెరికాలో ప్రారంభమైన దరిత్రి దినోత్సవ ఉత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
ప్లాస్టిక్ తోనే అధిక నష్టం:
విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే. మురుగు కాల్వలు, నదులు, పంట కాలువల్లో సైతం పాలిథిన్ సంచులే దర్శనమిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పర్యావరణానికి పెనుముప్పు తెస్తోన్న ప్లాస్టిక్ భూతాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి డి కంపోస్ట్ కాకపోవడంతో భూ ఉపరితలం దెబ్బతింటోంది. ఫలితంగా మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. భూమికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్న మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పటికే 40 మైక్రాన్ల లోపు ఉన్న ప్లాస్టిక్ ని వినియోగించడం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన ఎక్కడ కూడా ఈ ఆదేశాలను పాటించిన సందర్భాలు కనిపించడం లేదు. ధరిత్రిని పరిరక్షించే చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పటికీ వ్యవసాయ రంగంలో రసాయనాల వినియోగంతో భూసారం దెబ్బతిని కలుషితమైన పంటలే చేతికి అందుతున్నాయి. ఇప్పటికీ మనం తినే ఆహారం పంటలను రసాయనాలు, ఎరువులను ఉపయోగిస్తే గానీ తయారు కాని పరిస్థితి నెలకొంది. వాతావరణంలో సంభవించే మార్పుల వలన ఏడాదికి లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భూమిపై పడ్డ వర్షాలతో భూమి పైకి చేరే నీరు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టిక్ వ్యర్ధాలు అడ్డుకుంటున్నాయి. ఒకవేళ ప్లాస్టిక్ వ్యర్ధాలను తగలబెడితే పర్యావరణం కలుషితం అవుతుంది వాతావరణంలోకి రసాయనాలు చొచ్చుకుని ఆక్సిజన్ శాతం తగ్గిస్తుంది ప్లాస్టిక్ వ్యర్ధాలను తగల పెట్టడం వల్ల వాతావరణం కలుషితమై ఎల్ నినో పొరలపై ప్రభావం చూపుతుంది.
చెట్ల నరికివేతతో వర్షాలు తగ్గుముఖం:
మరోవైపు విచ్చలవిడిగా చెట్లు నరికి వేయడంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడి, వర్షాలు సైతం సకాలంలో కురవడం లేదు. దీంతో వ్యవసాయం నష్టాలనే మిగిలిస్తుంది. చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే బాధ్యత మనందరి మీద ఉన్న మనం బాధ్యతారహితంగా చెట్లను నరికి వేస్తున్నాం. చెట్లు నరకడం వల్ల వర్షాలు కురవకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు భవిష్యత్ తరాలకు హాని కలిగిస్తున్నాము. ప్రస్తుతం ఆధునిక పోకడలు పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడం వల్ల భవిష్యత్ తరాలకు శాపంగా మారనుంది.
విషవాయువులు.. రసాయన ఎరువులతో ప్రమాదం:
పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఉండదు. పరిశ్రమల ప్రాంగణాలలో పచ్చదనం పెంచుతూ తనవంతుగా పర్యావరణానికి దోహదం చేసే ప్రయత్నం చేయాల్సి ఉంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ప్రాణవాయువును అందించే చెట్లను నరికి వేస్తూ వాటి స్థానంలో మొక్కలు నాటడం లేదు. వ్యవసాయంలో వినియోగిస్తున్న రసాయన ఎరువులు భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల వ్యవసాయం నుంచి విపరీతంగా కాలుష్యం వెలువడుతోంది. 475 కోట్ల హెక్టార్ల భూమి పాడిపంటలకు వినియోగిస్తున్నారు. ఇందులో పంటలు సాగవుతున్న భూమి దాదాపు 152.70 కోట్ల హెకార్లే ఉంది. అధికంగా వెలువడే కాలుష్య ఉద్గారాలు, అధిక కాలుష్యం వల్ల పంటల ఉత్పాదకత పెరగడం లేదు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు:
పర్యావరణానికి ముప్పు కలిగించే అంశాలల్లో అతి ప్రధానమైనది భూమి వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్). రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏటా ఏసీల అమ్మకాలు రెట్టింపు అవుతున్నాయి. వీటి వల్ల విడుదలయ్యే క్లోరో ఫ్లోరో వాయువులు పర్యావరణానికి మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడం వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. మంచు కొండలు కరిగి సముద్రాల నీటి మట్టం పెరగడం, తుఫానులు రావడం, రుతుపవనాల మార్పు, అతివృష్టి, అనావృష్టి కలుగుతుంది. వేసవిలో వేడి గాలుల తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
భూతాపాన్ని తగ్గించాలి:
భూతాపాన్ని తగ్గించు కునేందుకు అడువులను విరివిగా పెంచాలి, క్లోరో ఫ్లోరో కార్బన్ లను విడుదల చేసే రిఫ్రిజిరేటర్లు, ఏసీల వినియోగం తగ్గించాలి. దూర ప్రయాణాలకు కార్లు, బైకులకు బదులు రైళ్లు, బస్సులు ఉపయోగించాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోవాలి. హానికరమైన రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడాలి, సుస్థిర వ్యవసాయం పద్ధతులు అవలంబించి, జీవ వైద్యాన్ని పరిరక్షించి, భూమాతకు హానికలిగించే ప్లాస్టిక్ బ్యాగులను వాడడం మానుకోవాలి. ప్రభుత్వ పరంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ పాఠశాలలు, కళాశాలల స్థాయిలో విద్యార్థులకు వీటి పై పూర్తి అవగాహన కల్పించాలి.
భూమిని (దరిత్రిని) కాపాడడం మన బాధ్యత:
భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే మనం భవిష్యత్ తరాలకు ఎలాంటి భూతాపం లేని వాతావరణం అందించవచ్చు. భూతాపం పెరిగి ఎండా కాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు ఇలా వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత వాహనాలను వీలైనంత తక్కువగా వినియోగించి, నీరు, విద్యుత్, ఆహారం వీలైనంతవరకు వృధా చేయకుండా, అవసరం లేనప్పుడు విద్యుత్ బల్బులను ఉపయోగించకుండా, మన పరిసరాల్లో భూగోళ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మానవాళి పురోగమన చర్యలకు తోడ్పడి దరిత్రి పరిరక్షణ స్ఫూర్తిని పెంచుకోవాలి. అప్పుడే మన భూమిని (దరిత్రిని) కాపాడుకో కలుగుతాం…