అనన్య న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో దుష్ప్రచారంతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రగతి నిరోధకులను మంత్రి కేటీఆర్ కోరారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శనివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రం సమీపంలో దివిటిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన ఐటి టవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటి కారిడార్ లో ఏర్పాటు చేయనున్న అమరరాజా సంస్థకు చెందిన గీగా కారిడాకు కేటీఆర్ భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏ దేశమైనా రాష్ట్రమైనా అందరికీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, ఇది పోటీ ప్రపంచం ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప పరిశ్రమలు తీసుకురాలేమని అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు మాత్రమే పోటీ పడటం లేదు ఎన్నో దేశాలతో పోటీపడి పారిశ్రామికవేత్తలను మెప్పించి రాష్ట్రానికి రప్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. భారతదేశంలో అపారమైన యువశక్తి ఉంది దేశ జనాభాలో 35 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు 65 శాతం ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించడం సాధ్యం కాదు. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? అన్ని సమకాలిక సదుపాయాలు కల్పించే పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే కొలువులు వస్తాయి, రాష్ట్రానికి సంపద వస్తుంది.
తెలంగాణలో ఆహార ఉత్పత్తుల పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆరేళ్ల క్రితం గల్లా జయదేవ్ ని కోరానని, రాష్ట్రంలో ఏదైనా భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆనాడే ఆయన తెలిపారని అన్నారు. నేడు మహబూబ్ నగర్ లో అమరరాజ యూనిట్ రావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షకంగా 10 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది దీనివల్ల పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి ఇది చూసి మరిన్ని పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తాయి. వచ్చే పదేళ్లలో అమరరాజా సంస్థ రూ.9500 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతుండగానే స్థానికంగా ఉన్న ఐటి టవర్లో సంస్థకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు మొదలుపెట్టి, స్థానికులకు అర్హతకు తగిన ఉద్యోగం కూడా ఇస్తామని సంస్థ తెలిపింది. స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు సంస్థకు అన్ని సహాయ సహకారాలు అందించాలని అన్నారు.