అనన్య న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ లక్ష్యాలు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే నెరవేరుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రుక్కంపల్లి వద్ద సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసమే వాగ్దానాలు చేసేది బిఆర్ఎస్ పార్టీ అని, దళితుడుని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని వాగ్దానం చేసి పదేళ్లు కావస్తున్న అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కుర్చీ వేసుకుని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్ వాగ్దానం ప్రకటనలకే పరిమితమైందన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ తో పాటు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లా రైతుల పొలాల్లో కృష్ణానది జలాలను పారిస్తామని అన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఈనెల 25న జడ్చర్ల పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సభకు పార్టీ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు వచ్చిన రిజల్ట్ తెలంగాణలో ఉంటుందని, దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం వృధా అవుతుందని, తెలంగాణలో 2014 కు ముందు నీళ్లు, నిధులు, నియామకాల పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉందని, తుది దశ తెలంగాణ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 25న జడ్చర్ల పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.