అనన్య న్యూస్, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా 125 అడుగుల కంచు విగ్రహాన్ని బౌద్ధ గురువుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబెడ్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విగ్రహావిష్కరణ ముందు హెలికాఫ్టర్ ద్వారా అంబెడ్కర్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
కాగా 125 అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని 98 ఏళ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్ రూపొందించారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఘనంగా సత్కరించనుంది. నిజానికి ఈ విగ్రహ పార్కును సంవత్సర కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం 2016లో 11.4 ఎకరాల స్థలాన్ని ఎన్టీఆర్ పార్క్ పక్కన కేటాయించింది. కానీ అంతా పూర్తయ్యే సరికి ఆరేళ్లు పట్టింది. 2016 ఏప్రిల్ 14న రూ.146 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. భూమి నుంచి చూస్తే విగ్రహం పై వరకూ మొత్తం 175 అడుగులు. అంటే విగ్రహం కింద ఉన్న బేస్ 50 అడుగుల ఎత్తు ఉంది. విగ్రహం 2 ఎకరాల స్థలంలో ఉంది.
ఈ విగ్రహం కోసం 155 టన్నుల స్టీల్, 111 టన్నుల కాంస్యంని ఉపయోగించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 425 మంది కార్మికులు పని చేశారు. విగ్రహం కింద ఉన్న బేస్‌ని ప్రస్తుత పార్లమెంట్ భవనం ఆకారంలో నిర్మించారు. తద్వారా రాజ్యాంగ రూపశిల్పి అనే అర్థం వచ్చేలా చేశారు. ఇందులో అంబేద్కర్ ఫొటో గ్యాలరీ, ఆయన జీవిత చరిత్ర విశేషాలు ఉండనున్నాయి. ఈ భవనం, విగ్రహం అన్నీ భూకంపాల్ని తట్టుకునేలా నిర్మించారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ దాదాపు 9 ఏకరాల్లో మెమొరియల్ పార్కు ఉంది. ఇక్కడే మ్యూజియం, లైబ్రరీ కూడా ఉంటాయి. రోజూ వేల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లున్నాయి. 50 అడుగుల పీఠం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. దేశంలోనే ఇది అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఇదే కావడం మరో విశేషం. 11.80 ఎకరాల్లో రూ.146.50 కోట్ల నిధులతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ప్రకాష్ అంబేడ్కర్‌కు సాదర స్వాగతం:
అంతకుముందు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రకాష్ అంబేడ్కర్‌ను ప్రగతిభవన్‌లో సాదర స్వాగతం లభించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనకు ఆహ్వానం పలుకుతూ… శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రకాష్‌తో కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం భోజనంతో ప్రకాష్‌కు కేసీఆర్ అతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్న ధోంగే, సిద్దోజీరావు తదితరులు పాల్గొన్నారు.అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్.. డా. బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.