అనన్య న్యూస్, ఖమ్మం: గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మంలోని 11 గోశాలలకు సత్తుపల్లి నియోజకవర్గం నుండి 150 ట్రాక్టరు ట్రక్కుల పశుగ్రాసాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేసారు. బుధవారం ఖమ్మంలోని టేకులపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాల వద్ద రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అదనపు కలెక్టరు మధుసూదన్ , సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతులు గోపూజ నిర్వహించి పశుగ్రాసాన్ని వితరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ మూగ జీవాలకు పశుగ్రాసాన్ని వితరణ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని, గోవు మన వ్యవసాయానికి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకి ఆధారమని, సృష్టిలో జీవించే హక్కు మానవులతో పాటు సకల జీవరాశులకూ ఉంటుందన్నారు. వ్యవసాయభివృద్ధి జరగాలంటే పశువులుంటేనే సాధ్యమవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా గోశాలలకు గడ్డిని వితరణగా అందజేసినట్లు తెలిపారు. నోరు ఉండి మాట్లాడగలిగే ప్రతి జీవికి ఏదో రకంగా సహాయం అందుతున్న తరుణంలో నోరులేని మూగజీవాలకు సహాయం అందించాలనే సంకల్పంతో సత్తుపల్లి నియోజకవర్గ రైతులు సహకారంతో ఐదు ఏళ్ల నుండి గోశాలలకు పశుగ్రాసాన్ని వితరణ చేస్తున్నామని అన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా 120 కిలోమీటర్ల నుండి ఖమ్మంకు 150 ట్రాక్టర్ల ట్రక్కుల పశుగ్రాసాన్ని అందించేందుకు రైతులు పిలుపు మేరకు స్వచ్చందంగా సహకరించారన్నారు.

రైతుల జీవితంతో ముడిపడి ఉన్న గోసంపదని రక్షించాలి, గోవును పూజించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల సహాయం అందిస్తే, నోరులేని మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడడంతో, గోవులకు సహాయం అందించాలని ఆ రోజుల్లో పిలుపునిస్తే వందల సంఖ్యలో పశుగ్రాసం దొరకని సమయంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో భద్రాచలం గోశాలలకు పశుగ్రాసాన్ని అందించామన్నారు.