అనన్య న్యూస్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై నాలుగు రోజుల పాటు తర్జన భర్జనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంపై సుదీర్ఘంగా సమాలోచనలు చేసి, చివరకు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని గురువారం సాయంత్రం బెంగళూరులో నిర్వహించే కాంగ్రెస్ ఎల్‌పీ మీటింగ్‌లో ప్రకటించే అవకాశం ఉంది.
సిద్ధరామయ్య, శివకుమార్ శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎల్పీ నాయకుడిగా సిద్ధరామయ్య పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక కేబినెట్‌పై కూడా అధిష్టానం తీవ్ర కసరత్తు చేసి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘంగా చర్చించి, పరిష్కరించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.