అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల వంద పడకల ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని సోమవారం సందర్శించి ఆసుపత్రిలోని వసతులను పరిశీలించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఎర్రశేఖర్ మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రిలో సమస్యలు తప్ప మెరుగైన వైద్యం అందడం లేదని, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేశారు తప్ప ఆసుపత్రిలో పరికరాలు లేవని, వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అన్నారు.
గత కొన్ని రోజుల క్రితం వంద పడకల ఆస్పత్రికి ఓ విలేఖరి కుటుంబ సభ్యురాలు ప్రసవానికోసం వస్తే, ఆమెను మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించే క్రమంలో పసిబిడ్డ చనిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జడ్చర్ల ఆసుపత్రి తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఆసుపత్రిలో నిర్మించి ప్రారంభించారు కానీ అన్ని ఆసుపత్రిలో సరైన వసతులు, వైద్యులు, సిబ్బంది లేరని, ఇలా వసతులు లేకుండా ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.